హనుమకొండ | తేది: 04-02-2026
బాల్యవివాహాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా కనకదుర్గ కాలనీలో మహిళా శిశు సంక్షేమ శాఖ, షేర్ ఎన్‌జీవో సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన ప్రచార రథాన్ని ఎంపీ డా.కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, బాల్యం అమూల్యమైన దశ అని పేర్కొన్నారు. బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక-మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల జీవితాంతం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో షేర్ ఎన్‌జీవో డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ సిరీష, వరంగల్ సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ వాసుధ, సభ్యురాలు మధు, హనుమకొండ సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్లు జ్ఞానేశ్వరి, జగన్, చామంతి, జమున, ప్రశాంతి, కల్పన, ప్రభాకర్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.


