హనుమకొండ: ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్ రావు గారి 24వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో, బియ్యాల జనార్ధన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి వద్ద జరిగింది.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ, బియ్యాల జనార్ధన్ రావు గారి జీవితం సమాజానికి అంకితమైందని పేర్కొన్నారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేసి, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం పోరాటం సాగించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కె. జయశంకర్ గారితో పాటు సైద్ధాంతికంగా బియ్యాల జనార్ధన్ రావు గారు విశేష కృషి చేశారని గుర్తుచేశారు. “నీళ్లు – నిధులు – నియామకాలు తెలంగాణ ప్రజలకే దక్కాలి” అనే ఉద్యమ ఆలోచనకు బలమైన రూపకల్పన చేశారని వివరించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు విద్యాబోధనతో పాటు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేలా ఆయన ప్రేరణనిచ్చారని అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆధారాలతో సమాజానికి వివరించి, ఉద్యమానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి బుచ్చిబాబు, పేరాల కిషన్ రావు, జగదీశ్, చక్రధర్, రాజేష్, కొమురయ్య, రాకేష్ యాదవ్, వీరు తదితరులు, కాకతీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


