ప్రాణాలతో చెలగాటం.. ఏనుగులగడ్డలో ఫేక్ డాక్టర్ బండారం బట్టబయలు :
హనుమకొండ జిల్లాలోని ఏనుగుల గడ్డ ప్రాంతంలో నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్ కంట్రోల్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రాజలక్ష్మి పర్యవేక్షణలో హనుమకొండ వరంగల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
అధికారుల సమాచారం ప్రకారం..ఏనుగుల గడ్డ ఇందిరానగర్ లో బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. దాడుల సమయంలో క్లినిక్ లో అక్రమంగా నిల్వ ఉంచిన వివిధ రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో మొత్తం 41 రకాల ఔషధాలు గుర్తించగా వాటిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు, యాంటీ అల్సర్ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ సహా 35 రకాల ముఖ్యమైన ఔషధాలు ఉన్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు 10,000లకు పైగానే ఉంటుంది అని అంచనా వేశారు.

ప్రత్యేకించి స్టెరాయిడ్ లను అర్హత లేని వ్యక్తులు విచక్షణ రహితంగా వినియోగించడం లేదా విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా ఇటువంటి మందుల వినియోగం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు వైద్య సేవలు పొందే ముందు వైద్యుల అర్హతలను నిర్ధారించుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించారు.


