న్యూ శాయంపేట ఆలయ భూముల వివాదంపై దాస్యం వినయ్ భాస్కర్ ఘాటు వ్యాఖ్యలు :
హనుమాన్ ఆలయ భూముల అంశంపై తనపై వస్తున్న విమర్శలకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే తాను పోరాడుతానని స్పష్టం చేశారు. న్యూ శాయం పేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడానికి భక్తునిగా వెళ్లానని.. ఆలయ భూమిని దేవాలయ అవసరాలకే కేటాయించాలని భక్తుల తరఫున డిమాండ్ చేసినట్లు తెలిపారు.
అయితే తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమని అన్నారు. ప్రజలు ఇచ్చిన పదవి ఉన్నా లేకపోయినా ప్రజాపక్షాన నిలబడడం తన బాధ్యత అని వినయ్ భాస్కరరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, పోరాడడం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. అలాగే న్యూ శాయం పేట శ్రీ భక్తాంజనేయ ఆలయ భూమిని హోటల్ నిర్మాణానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ అంశంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆలయ భూముల విషయంలో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్న నేతలు ముందు తమ గతాన్ని గుర్తు చేసుకోవాలని వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
ప్రజాసేవ చేయాల్సిన బాధ్యత ఉన్నవారు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. హనుమాన్ విగ్రహం ప్రతిష్టించిన వారిపై కేసులు నమోదు చేసిన అధికారులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని..? ఆయన ప్రశ్నించారు. ఆలయ భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు.


