హనుమకొండ ఆరోగ్యశాఖకు కొత్త బాస్..డీఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన దుర్గా రామ్ కుమార్..:
హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఎస్. దుర్గా రాంకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఆయనను హనుమకొండ డీఎంహెచ్‌వోగా నియమించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి ఆయన తన జాయినింగ్ రిపోర్ట్‌ను సమర్పించారు.
ఇంతకుముందు కూకట్‌పల్లి జోన్ డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహించిన డాక్టర్ దుర్గా రాంకుమార్, బదిలీపై హనుమకొండ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలనా అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు. అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌లను కూడా ఆయన కలిశారు.
కొత్త బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దుర్గా రాంకుమార్‌కు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రజారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఆయన నాయకత్వంలో శాఖ ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో మదన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ రుబీనా అప్రోజ్, ఏవో కోలా రాజేశ్, జిల్లా మాస్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, హెచ్‌ఏఓ చంద్రశేఖర్, డీపీఓ రుక్ముద్దీన్, ప్రసన్న కుమార్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


