📍 హనుమకొండ జిల్లా | ఆత్మకూరు మండలం | తిరుమలగిరి గ్రామం
తేది: 22-03-2026
ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం నీరని, దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గారు కూడా పాల్గొన్నారు. ముందుగా గ్రామ బొడ్రాయి నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు.
ప్రతి నీటి బొట్టు అమూల్యం
మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టు విలువైనదని, నీటిని వృధా చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు రక్షణ కల్పించగలమని తెలిపారు.

భూగర్భ జలాల పెరుగుదలకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. చెట్లు పెంచకపోతే రాబోయే రోజుల్లో గాలినే కొనాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ నీటిని వినియోగించాలి
గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న శుద్ధ నీటిని వినియోగించాలని మంత్రి సూచించారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడకుండా ప్రభుత్వ నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు శుద్ధ నీటి సరఫరాపై డెమో కూడా నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణపై దృష్టి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ గాలి, నీరు, భూమి వంటి పంచభూతాలను కాపాడితేనే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రతి ఇంటికి నీటి సంరక్షణ చర్యలు
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కనెక్షన్ ద్వారా శుద్ధ నీటిని అందిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ దేవేంద్ర, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


