హనుమకొండ కాకాజీ అడ్వకేట్స్ కాలనీలో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “కవిత్వంతో కలుద్దాం” అనే కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యగారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “సమాజంలో జరుగుతున్న మార్పులు, సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో కవిత్వం కీలక పాత్ర పోషిస్తుంది” అని తెలిపారు. ఉద్యమాలకు, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎప్పటికీ బలమైన ఆయుధమని పేర్కొన్నారు.

వరంగల్ ప్రాంతం పోరాటాలకు మాత్రమే కాదు.. సాహిత్య వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందినది అని ఆమె తెలిపారు. పాలకుర్తి సోమనాథుడు, పోతన వంటి మహనీయుల ఆలోచనలను నేటి రచయితలు కొనసాగించడం అభినందనీయం అన్నారు.

సమాజంలో పెరుగుతున్న అసమానతలు, ఆధిపత్య ధోరణులపై రచయితలు తమ కలంతో స్పందించాలని పిలుపునిచ్చారు. యువతతో పఠానాభివృద్ధి, సృజనాత్మకత పెంపొందించేందుకు ఇటువంటి కవి సమ్మేళనాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కుంజ కళ్యాణి రచించిన “కంక పొద” పుస్తకాన్ని పరిచయం చేయగా.. పలువురు కవులు తమ కవిత్వాలను వినిపించారు. వివిధ రంగాలకు చెందిన సాహితీవేత్తలు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


