మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల రద్దీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మేడారంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ రోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి చేరుకునే సమయానికి ఈ సంఖ్య కోటిని దాటే అవకాశం ఉందని అధికారుల అంచనాను వెల్లడించారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.
జాతర శాశ్వత అభివృద్ధికి ఇప్పటికే 29 ఎకరాల భూమి సేకరణ పూర్తయిందని, మరో 41 ఎకరాల ప్రక్రియ జరుగుతోందని, మొత్తం 70 ఎకరాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు (కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు) ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.
దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
గోదావరి పరివాహక ప్రాంత ఆలయాల అభివృద్ధిలో మేడారం కూడా భాగమవుతుందని ప్రకటించారు.
జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా రామప్ప-లక్నవరం నుంచి పైప్‌లైన్, చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని, మాస్టర్ ప్లాన్ ప్రకారం అంతర్గత రోడ్లు, ఎకో పార్కులు, పర్యాటక సౌకర్యాలు విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు.
సోషల్ మీడియా దుష్ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
పంచాయతీరాజ్ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి రెండు రోజుల్లోనే 70-80 లక్షల మంది దర్శనం చేసుకున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం, మంత్రి పొంగులేటి పర్యవేక్షణతో అతి తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు సులువయ్యాయని, భవిష్యత్తులో శాశ్వత తాగునీరు, మరుగుదొడ్లు, చెట్ల పెంపకం చేపడతామని తెలిపారు.
జాతర విజయవంతానికి సహకరించిన ప్రభుత్వం, అధికారులు, మీడియాకు సీతక్క అభినందనలు తెలిపారు.
శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు వనప్రవేశం చేయనున్నందున, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనం చేసుకోవాలని మంత్రులు కోరారు


