నెక్కొండలో మునగ తోటల మోసం.. రూ.30 లక్షలు స్వాహా :
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మునగ తోటల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 30 లక్షల వరకు ప్రభుత్వ నిధులు అక్రమంగా డ్రా చేసినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు.
గ్రామానికి చెందిన 40 మంది రైతులు 2025-26 సంవత్సరానికి 40 ఎకరాలలో మునగ తోటలు సాగు చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద దరఖాస్తులు సమర్పించారు. సంబంధిత అధికారులు అనుమతులు మంజూరు చేయగా రైతులు తోటలు ఏర్పాటు చేసినట్లు నివేదించారు. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకుండా రికార్డుల్లో మునగ మొక్కలు నాటినట్లు నమోదు చేసి ఎంబి రికార్డులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అనంతరం రైతుల ఖాతాల్లో 30 లక్షల నిధులు జమయ్యాయి.
ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఈ నెల 25న ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం డీఆర్‌డీఏ పీడీ నాగపద్మజ, ఎంపీడీవో లావణ్య గ్రామంలో ప్రత్యక్షంగా పరిశీలనలో చేపట్టారు. విచారణలో కేవలం నాలుగు ఎకరాలలో మాత్రమే మునగ తోటలు ఉన్నట్లు మిగతా 36 ఎకరాల్లో ఎలాంటి సాగు జరగలేదని అధికారులు గుర్తించారు.
అయితే సాంక్షన్ జాబితాలో మాత్రం 40 మంది రైతుల పేర్లు నమోదయి ఉండడంతో నిధులు తోటలు లేకుండానే విడుదలైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధి హామీ సిబ్బంది పర్యవేక్షణ లోపమే ఈ అవినీతికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ నాగ పద్మజా తెలిపారు.


