గోపాలపూర్ ఊర చెరువు పూడికతీత పనులకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన:
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ గోపాలపూర్ లో ఉన్న ఊరు చెరువు పూడికతీత పనులను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే చెరువు సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాలకు ఉపయోగకరంగా మారనున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ..”చెరువుల పునరుద్ధరణ గ్రామీణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. పూడికతీత పనుల ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి రైతులకు స్థానిక ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ముఖ్యంగా వర్షాకాలంలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల్లో తరచుగా ఎదురయ్యే వరద ముంపు సమస్యలను తగ్గించడంలో ఈ పనులు సహాయపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరారు.


