ఎన్జీఓస్ కాలనీ, వడ్డేపల్లి
తేదీ: 05-04-2026 (ఆదివారం)
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను దశల వారీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆదివారం 58వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పాదయాత్రలో ప్రజలు తెలియజేసిన సమస్యలను గుర్తించి, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు. మొత్తం 26 డివిజన్లలో ప్రత్యక్షంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

ప్రభుత్వ యంత్రాంగం ప్రజల వద్దకే చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని శాఖల అధికారులు నేరుగా ప్రజల మధ్య ఉంటూ సేవలు అందించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి కార్యక్రమాల విజయానికి ప్రభుత్వం, ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ, రానున్న రోజుల్లో కూడా ప్రజలు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.


