తుదిమెరుగులు దిద్దుతున్న కళాకారులు.. మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
వరంగల్: దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రకాళి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులతో పాటు అమ్మవారి రథం పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న మాడవీధులు, అమ్మవారి రథం పనుల పురోగతిని పరిశీలించారు.
దసరా ఉత్సవాల సందర్భంగా భద్రకాళి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
తుదిదశలో అమ్మవారి రథం పనులు
అమ్మవారి రథానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నాయి. కళాకారులు రథానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. దసరా పర్వదినం నాటికి రథాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు మరింత సౌకర్యం
మాడవీధుల నిర్మాణం పూర్తయితే భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగడంతో పాటు, ఆలయ ఉత్సవాలు మరియు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
భక్తుల సౌకర్యం, ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, ఇంకా పూర్తికావాల్సిన పనులు, దసరా ఉత్సవాల నాటికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో KUDA అధికారులు అజిత్ రెడ్డి, భీమ్ రావు, ఆలయ ఈఓ సునీత, స్థానిక నాయకులు బోడ డిన్న, డివిజన్ అధ్యక్షులు సమద్, మాజీ అధ్యక్షులు సంగీత, గోల్కొండ సాంబయ్య, క్రాంతి కుమార్, శివ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


