హైదరాబాద్: బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
బుధవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, పశుసంవర్ధక శాఖ సెక్రటరీ కె. ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన చర్చలు, ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశ నిర్ణయాల మేరకు…
ఈ నెల 27న జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ ఇతర పండుగలతో పోలిస్తే అత్యంత సున్నితమైనదని..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన పశువుల అక్రమ రవాణా ఘటనల నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు.
పశువుల రవాణా విషయంలో కౌ స్లాటర్ యాక్ట్-1977, ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్-1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్-1960 చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని…
నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ రవాణాను అరికట్టేందుకు
ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు…
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో జరిగే పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
చెక్ పోస్టుల వద్ద ‘ఫిట్ టు ట్రాన్స్‌పోర్టేషన్’, ‘ఫిట్ టు స్లాటర్’ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని…
పండుగ ముగిసే వరకు తనిఖీలు నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు.
శాంతిభద్రతల విషయంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ స్పష్టం చేశారు.
పశువుల రవాణాపై అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప, రోడ్లపైకి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని ఖురేషీలు, గోరక్షక బృందాలకు సూచించారు.
నిబంధనలు మీరి రాద్ధాంతం చేసే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
అలాగే సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించేలా పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
అవసరమైతే అలాంటి వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు.
పోలీస్, మున్సిపల్, పశుసంవర్ధక, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ సూచించారు.
సీజ్ చేసిన పశువుల సంరక్షణ కోసం తగిన సౌకర్యాలతో క్యాటిల్ పాండ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బక్రీద్ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.
పశుసంవర్ధక శాఖ సెక్రటరీ కె. ఇలంబర్తి మాట్లాడుతూ.. పశువుల రవాణాకు అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేసేందుకు వెటర్నరీ వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.


