హన్మకొండ: హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓ పేకాట స్థావరంపై వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో భారీగా నగదుతో పాటు నిర్వాహకులు, ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
సుబేదారి పరిధిలోని ఇందిరానగర్ గృహ సముదాయాల్లో రహస్యంగా జూదం నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది.
ఈ దాడిలో మొత్తం 10 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో హన్మకొండతో పాటు జనగామ, హుజూరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఘటనా స్థలం నుండి రూ. 1,91,150/- నగదు తో పాటు, నిందితులకు చెందిన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో, సీఐ బాబులాల్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌ను అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించింది. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న సుబేదారి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


