హనుమకొండ, జనవరి 31 (2026)
ఏడాది క్రితమే పార్లమెంట్‌లో ఈ అంశంపై గళమెత్తిన కడియం కావ్యకు సుప్రీంకోర్టు తీర్పు బలం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద నెలసరి పరిశుభ్రత (మెన్‌స్ట్రువల్ హైజీన్) మహిళల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తీర్పును వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హృదయపూర్వకంగా స్వాగతించారు. అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.
గత ఏడాది పార్లమెంట్‌లోనే ఈ అంశంపై గళమెత్తిన వ్యక్తి కడియం కావ్యే. బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించి, సమగ్ర విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ దిశలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం:
- ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థినులకు పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలి.
- శుభ్రమైన టాయిలెట్లు, నీటి సౌకర్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ తప్పనిసరి.
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా డా. కడియం కావ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలు పరిశుభ్రతా సౌకర్యాల కొరత వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెలసరి పరిశుభ్రత కేవలం ఆరోగ్య సమస్య కాదు, అది మానవ హక్కులు, విద్యా హక్కు, లింగ సమానత్వంతో ముడిపడిన అంశమని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో నాణ్యమైన, పర్యావరణ హితమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం, శుభ్రమైన సౌకర్యాలు కల్పించడం తప్పనిసరని పేర్కొన్నారు.
అవగాహన కార్యక్రమాలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మూడు దశాబ్దాల తర్వాత తెలంగాణ నుంచి మహిళా ఎంపీగా ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన ఘనత కూడా కడియం కావ్యదే.
ఉద్యోగ రంగంలో మహిళలకు నెలసరి సమయంలో ప్రత్యేక సౌకర్యాలు, పెయిడ్ లీవ్, రెస్ట్‌రూమ్‌లు తప్పనిసరి చేసే బిల్లులను ఆమె లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
సుప్రీంకోర్టు తీర్పు తన పోరాటానికి బలం చేకూర్చిందని, మహిళల ఆరోగ్యం-భద్రత కోసం ఇక ఎవరూ వెనక్కి తగ్గరాదని డా. కడియం కావ్య ధీమా వ్యక్తం చేశారు.


