ఫ్రీ బస్ ప్రయాణంలో కీలక మార్పు..మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు:
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మరో కీలక మార్పు తీసుకురానుంది. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఇకపై ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ కొత్త విధానం జూన్ రెండు నుంచి ప్రారంభం కానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు మహిళలు ప్రతి ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించాల్సి వచ్చేది. కొత్త స్మార్ట్ కార్డ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ అవసరం లేకుండా కేవలం కార్డు చూపించి టికెట్ పొందే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
ప్రభుత్వం తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనుంది. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, ప్రజల స్పందనను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మహిళలు ఇస్మార్ట్ కార్డులను మీసేవ కేంద్రాలు, ఆర్టీసీ బస్సు పాస్ కౌంటర్ల ద్వారా పొందవచ్చు. ఒక్క కార్డు కోసం 50 రూపాయల రుసుము వసూలు చేయనున్నట్లు సమాచారం. కార్డులు అందుబాటులోకి వచ్చేవరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆధార్ ఆధారిత ఉచిత ప్రయాణ విధానం కొనసాగుతుంది. తెలంగాణలో మహిళల ఫ్రీ బస్ జర్నీ పథకానికి ఇప్పటికే భారీ స్పందన లభిస్తుంది. ప్రతిరోజు లక్షలాది మహిళలు ఈ సేవలను వినియోగిస్తున్నారు.
స్మార్ట్ కార్డుల ద్వారా ప్రయాణికుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదు కావడంతో పాటు దుర్వినియోగాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కార్డుల దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాలు పంపిణీ తేదీలపై ప్రభుత్వం త్వరలో పూర్తి మార్గదర్శకాలను వి డుదల చేయనుంది.


