రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై మంత్రి సీతక్క స్పందించారు. ప్రస్తుతం మేఘాలయ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆమె, అక్కడ నుండే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, కార్మికులు తమ సమ్మెను తక్షణమే విరమించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మొత్తం 32 డిమాండ్లలో, ఇప్పటికే 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె హామీ ఇచ్చారు.
ఉచిత బస్సు పథకంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసిన రెండు రోజులకే కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ సమ్మె కారణంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న పేద మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు.
ప్రభుత్వంతో చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, కార్మికులు మొండివైఖరి వీడాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.


