హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మంగళవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ మేళాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
నాటు యంత్రంపై ఎమ్మెల్యే ట్రయల్:

మేళాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ స్టాళ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆధునిక వరి నాటు యంత్రం పనితీరును కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యంత్రం పనితీరుపై అవగాహన కోసం స్వయంగా డ్రైవర్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టి అక్కడున్న వారిని సందడి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఇలాంటి ఆధునిక పరికరాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఘనంగా ప్రారంభోత్సవం:
అంతకుముందు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క మరియు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపడుతున్న 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ మేళా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
పాల్గొన్న ఇతర ప్రముఖులు:
నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, హార్టికల్చర్ సెక్రటరీ యాస్మిన్ బాషా, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మరియు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


