మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనిచేస్తున్న శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్రం రూ. 1,805 కోట్లను విడుదల చేసింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదలైన ఈ నిధులు త్వరలోనే కూలీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఉపాధి పనులకు హాజరైన శ్రామికులకు సంబంధించి సుమారు రూ. 1,042 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన నిధులతో ఈ పాత బకాయిలన్నీ చెల్లించనున్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నిధుల వివరాలను వెల్లడించారు.
పాత బకాయిల చెల్లింపుల తర్వాత మిగిలిన నిధులను ఈ నెలాఖరు వరకు జరిగే ఉపాధి పనుల వేతనాల కోసం ఖర్చు చేయనున్నారు.
నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం కావడంతో, ఎండ కాలంలో ఉపాధి పనులపై ఆధారపడే పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ నిధుల విడుదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఉపాధి హామీ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. గడిచిన కొద్ది నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్న శ్రామికులకు ఇది మంచి శుభవార్త.


