హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా ఆమె సంధించిన విమర్శలు, వేసిన పంచులతో సభలో వాతావరణం వేడెక్కింది. గత రెండు రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ ప్రతిపక్ష నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో ప్రసంగించిన యశస్విని రెడ్డి, బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికి అడ్డుతగులుతున్న విపక్ష నేతల తీరు చూసి “నిన్నటి నుంచి చూస్తున్నా.. అసలు ఏంది ఈ లొల్లి?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశాయి.
రాజకీయ విమర్శల నేపథ్యంలో సీనియర్ నేత కడియం శ్రీహరి గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. “కడియం శ్రీహరి గారు మా అందరికీ తండ్రి లాంటి వారు. ఆయన అనుభవం, మార్గదర్శకత్వంలోనే మేము రాజకీయంగా ముందుకు సాగుతున్నాం” అని పేర్కొంటూ, తమ మధ్య విభేదాలు సృష్టించాలనుకునే వారికి చెక్ పెట్టారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనను “దౌర్జన్య పాలన”గా అభివర్ణించిన యశస్విని రెడ్డి, ఆ కాలంలో జరిగిన ప్రతి పనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రజల సొమ్మును ఎవరు లూటీ చేశారో బయటపడాలి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అప్పటి దౌర్జన్యాలకు స్వస్తి పలికి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన “ప్రజాపాలన” సాగుతోందని ఆమె స్పష్టం చేశారు.


