టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్కుల మెమోలు విడుదల:
రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మార్కుల మెమోలను వెంటనే అందజేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పై చదువుల్లో ప్రవేశాలు పొందే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను స్పష్టం చేసింది.
మార్చ్ 2026లో నిర్వహించిన SSC పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలను ప్రభుత్వం సంబంధిత పాఠశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ల ద్వారా మెమోలను డౌన్లోడ్ చేసి వివరాలను సరి చూసి విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు.
విద్యార్థులు ఇంటర్మీడియట్ తో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ మార్కుల మెమోలు తప్పనిసరి కావడంతో పంపిణీ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పి.వి. శ్రీహరి ఉత్తర్వుల్లో తెలిపారు.


