హన్మకొండలోని స్నేహ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వింత ఘటనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సాధారణంగా దొంగలు నగలు, నగదు ఎత్తుకెళ్తారు. కానీ ఇక్కడ దొంగ తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది.
గత వారం పది రోజులుగా కాలనీలోని ఇళ్ల ఆవరణలో ఆరవేసిన మహిళల దుస్తులు, లోదుస్తులు మాయమవుతున్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎత్తుకెళ్లిన బట్టలను మళ్లీ వారం రోజుల తర్వాత అదే ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తి వదిలి వెళ్తున్నాడు.
స్థానికులు అప్రమత్తమై సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 1 గంటల నుండి 3 గంటల మధ్య ఈ వ్యక్తి సంచరిస్తున్నాడు. ముఖానికి మాస్క్ ధరించి, మహిళల దుస్తులు వేసుకుని ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఈ వింత దొంగ వ్యవహారంతో కాలనీ మహిళలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.


