ఓటర్ల జాబితానే విజయానికి పునాది.. ప్రతి ఓటును కాపాడాలి: ఎంపీ డాక్టర్ కడియం కావ్య:
ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేవలం ప్రచారం సరిపోదని, బలమైన ఓటర్ల జాబితా నిర్మాణమే విజయానికి తొలి మెట్టని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) పాత్ర అత్యంత కీలకమని ఆమె అన్నారు. ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేస్తూ ఓటర్ల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు.

జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు.

సమావేశంలో మాట్లాడిన ఎంపీ, ఓటర్ల జాబితాల నిర్వహణలో రాజకీయ ప్రయోజనాలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు పొందలేని పరిస్థితుల్లో ఓటర్ల జాబితాల్లో మార్పుల ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, అది ఎవరికీ దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు.

వచ్చే మూడు నెలల పాటు ఇంటింటా ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, తొలగించబడిన పేర్ల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ఓటు వేసిన వారి పేర్లు కూడా భవిష్యత్తులో జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రతి బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను కూడా విస్తృతంగా వివరించాలని సూచించారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, ఓటు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకేనని స్పష్టం చేశారు.

అనంతరం డాక్టర్ కడియం కావ్య రూపొందించిన ‘బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్’ను ఆవిష్కరించి బీఎల్ఏలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


