హసన్పర్తి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ A. మహేందర్ ఆధ్వర్యంలో బుధవారం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
సమాజంలో అలజడి సృష్టించే పనులు చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.
సెటిల్మెంట్లు, భూ కబ్జాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గట్టిగా ఆదేశించారు.
యువత చెడు మార్గాలను వీడి, కుటుంబ బాధ్యతలను స్వీకరించి, గౌరవప్రదమైన ఉపాధి మార్గాల్లో స్థిరపడాలని సూచించారు.
పద్ధతి మార్చుకోకుండా తిరిగి నేర ప్రవృత్తిని కొనసాగిస్తే, చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
”ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలి. పాత నేరాలను వదిలిపెట్టి సమాజంలో గౌరవంగా బతకడానికి ప్రయత్నించండి. చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.” — A. మహేందర్, ఇన్స్పెక్టర్, హసన్పర్తి.


