సొంతింటి కల సాకారం.. వరంగల్ పశ్చిమలో రెండో విడత డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ :
హనుమకొండ : గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుండి పది రోజుల్లో రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే తొలి దశలో వందలాది మంది లబ్ధిదారులకు ఇల్లు అందజేసిన ప్రభుత్వం. ఇప్పుడు హనుమకొండ న్యూ శాయంపేటలో నిర్మించిన మరో విడత గృహాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది.
గత ఏడాది ఆగస్టులో ఏషియన్ మాల్ సమీపంలో నిర్మించిన 592 డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను లబ్ధిదారులకు అందజేశారు. ఈ ప్రాజెక్టులో తమ నివాసాలను కోల్పోయిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అర్హులైన ఇతర పేద కుటుంబాలకు కూడా అవకాశం కల్పించారు. ప్రస్తుతం న్యూ శాయంపేటలో రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మించిన సుమారు 6000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఇళ్ల కోసం గతంలోనే దరఖాస్తులు స్వీకరించగా గత కొన్ని నెలలుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అర్హుల జాబితా తుది దశకు చేరుకోవడంతో పంపిణీ కార్యక్రమం పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. అదేవిధంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ గూడూరు ప్రాంతాల్లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. కమలాపూర్ లో 302 గూడూరులో 50 ఇళ్లతో మొత్తం 352 గృహాలను లబ్ధిదారులకు అందించనున్నారు.
ఇళ్ల కేటాయింపులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ గతంలో అమలు చేసినట్లే ఈసారి కూడా లక్కీ డ్రా విధానాన్ని కొనసాగించనున్నారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించే డ్రా ప్రక్రియ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అర్హులైన పేద కుటుంబాలకు ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


