15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. కోట్ల సంపద వెనుక కథ ఇదే:
భారత క్రికెట్ లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న యువ ఆటగాడు “వైభవ్ సూర్యవంశీ” ప్రస్తుతం తన అద్భుత ఆట తీరుతో పాటు ఆర్థిక విజయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారీ ఆదాయం విలాసవంతమైన జీవనశైలితో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌కు చెందిన వైభవ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ పై అపారమైన ఆసక్తి చూపించాడు. పరిమిత వనరుల మధ్య కుటుంబం అతని
కలలను నెరవేర్చేందుకు ఎంతో కష్టపడింది.
ఒకప్పుడు ఇంటి వెనక ఖాళీ ప్రదేశంలో సాధన చేసిన ఈ యువ క్రికెటర్ కోసం అతని కుటుంబం అనేక త్యాగాలు చేసింది. ఆ కష్టాలు అన్నిటికీ ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ తన దూకుడైన బ్యాటింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఫ్రాంచైజీ నుంచి లభిస్తున్న భారీ ఒప్పందంతో పాటు మ్యాచ్ ఫీజులు, దేశీయ టోర్నీల ఆదాయం కూడా అతని సంపాదనకు బలంగా మారాయి. దీంతో చాలా తక్కువ వయసులోనే కోటీశ్వరుల జాబితాలో చోటు సంపాదించాడు..
క్రికెట్ కెరీర్ పురోగతిని దృష్టిలో పెట్టుకొని ముంబైలో విలువైన నివాసాన్ని కుటుంబానికి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. అలాగే అతని ప్రతిభకు మెచ్చిన పలువురు ప్రముఖులు సంస్థలు ఖరీదైన బహుమతులు అందజేశారు. యువ వయసులోనే లగ్జరీ కార్లు, ఆధునిక సౌకర్యాలతో కూడిన జీవనశైలీని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల జరిగిన ICC Under-19 Cricket World Cup లోను వైభవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
అతని విజయాలను గుర్తించిన బీహార్ ప్రభుత్వం నగదు పురస్కారంతో సత్కరించింది. మరోవైపు ప్రముఖ బ్రాండ్లు కూడా అతడిని ప్రచారకర్తగా ఎంపిక చేసుకుంటున్నాయి. కష్టపడితే వయసు అడ్డంకి కాదని నిరూపించిన వైభవ్ సూర్యవంశీ ప్రతిభతో పాటు పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ప్రస్తుతం అతని నికర ఆస్తి విలువ కోట్ల రూపాయల లో ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. తండ్రి పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ చిన్నారి ఇప్పుడు రూ.5 నుంచి 7 కోట్ల నికర ఆస్తితో దేశంలోనే అత్యంత సంపన్న యువ అథ్లెట్లలో ఒకడిగా దూసుకుపోతున్నాడు.


