ఉమ్మడి వరంగల్‌లో 279 ప్రీ ప్రైమరీ స్కూల్స్:
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో చిన్నారుల ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి జిల్లా వ్యాప్తంగా కొత్తగా 279 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందుబాటులోకి రానుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ప్రారంభ దశ నుంచి విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం మరింత పెరగనిందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్య అవకాశాలు విస్తరించేందుకు ఈ పాఠశాలలు దోహదపడనున్నాయి. జిల్లాల వారీగా చూస్తే వరంగల్ జిల్లాలో 48, హనుమకొండలో 39, జనగామలో 39, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 41, ములుగు జిల్లాలు 36 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి.
మెహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా 76 పాఠశాలలు మంజూరు కావడం విశేషం. ఈ కొత్త పాఠశాలల్లో చిన్నారులకు ఆటల ద్వారా బోధన, ప్రాథమిక అక్షరాస్యత, సృజనాత్మక అభ్యాస పద్ధతులను అమలు చేయనున్నారు. అలాగే అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడనుంది.



