హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 (క్లస్టర్–డి) పోటీలు మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐజీ గజారావు భూపాల్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ, పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడలు కీలకమన్నారు.
నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, కిట్స్ కళాశాల, భీమారంలోని ఎస్వీఎస్ కళాశాల మైదానాల్లో వివిధ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన సుమారు 1,458 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.


