కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన (వాల్యుయేషన్) ప్రక్రియను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సోమవారం పరిశీలించారు.
ఈ నెల 1వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ మూల్యాంకన కార్యక్రమాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాల్యుయేషన్ కేంద్రంలోని సౌకర్యాలను, భద్రతా చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది?, వాల్యుయేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు, పరీక్షా పత్రాల గోప్యత మరియు భద్రత కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు వంటి కీలక అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్ణీత గడువులోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.


