వరంగల్: వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇరుకుల్లా సంగీత (33), తన నివాసంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.
మృతురాలు సంగీత తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఒక లేఖను విడిచిపెట్టారు. అందులో తన మృతికి శ్రీధర్ అనే కానిస్టేబుల్ కారణమని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో సంగీత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శ్రీధర్ వేధింపుల వల్లే సంగీత ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపిస్తున్నారు.
సంగీత మృతికి కారణమైన కానిస్టేబుల్ శ్రీధర్‌ను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఎంజీఎం సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. సంగీత మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. బాధితులకు న్యాయం చేయాలని, దోషులను వదిలిపెట్టకూడదని వారు నినదించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంగీత రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న అధికారులు, అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.


