యాదాద్రి భువనగిరి: మద్యం బాటిల్లో మిగిలిన చివరి చుక్కల కోసం జరిగిన చిన్నపాటి గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితులే కాలయములై ఒకరిని హతమార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, జిల్లాలోని మేడిపల్లికి చెందిన రాయగిరి మధు, గాంధారి చరణ్ మరియు ఊట్ల నవీన్ అనే ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో బాటిల్లో మిగిలిన చివరి చుక్కల విషయంలో వీరి మధ్య వాగ్వాదం మొదలైంది.
ఈ వివాదం ముదిరి ఘర్షణగా మారడంతో, చరణ్ మరియు నవీన్ కలిసి మధుపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని షామీర్పేట్ కాలువలోని కంపచెట్లలో పడేశారు.
మధు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.


