హన్మకొండ : నగరంలోని పలు డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీరియస్ అయ్యారు. 43వ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, టీచర్స్ కాలనీ, నక్కలపల్లి, వినాయక నగర్, రాంగోపాల్పురం కాలనీల్లో ఆయన స్వయంగా పర్యటించి స్థానిక పరిస్థితులను సమీక్షించారు.
నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం మరియు వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం తాగునీటి సరఫరా కల్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.


