నల్గొండ: సాధారణంగా కవలలు అంటే రూపంలో ఒకేలా ఉంటారు. కానీ, ఈ కవలలు మాత్రం సాధించిన మార్కుల్లో కూడా ఒకేలా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే పాఠశాల.. ఒకే క్లాసు.. చివరకు పదో తరగతి ఫలితాల్లో కూడా ఒకే రకమైన మార్కులు సాధించి భేష్ అనిపించుకున్నారు.
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన శ్రీరామ్, లోకేష్ కవలలు. వీరిద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతూ, ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం తిరుమలగిరి సాగర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు.
బుధవారం విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ఈ అన్నదమ్ములిద్దరూ అద్భుత ప్రతిభ కనబరిచారు. విశేషం ఏమిటంటే, శ్రీరామ్ మరియు లోకేష్ ఇద్దరికీ ఖచ్చితంగా 549 మార్కులు చొప్పున వచ్చాయి. ఫలితాల్లో కూడా వీరిద్దరూ విడదీయలేని కవలలని నిరూపించుకోవడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
”మా పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే చదువుకుంటారు. ఒకరికొకరు పోటీ పడుతూ చదివినప్పటికీ, ఇలా ఇద్దరికీ ఒకే మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది.” అని వారి తండ్రి రామలింగం ఆనందం వ్యక్తం చేశారు.
ఒకే రకమైన మార్కులు సాధించిన ఈ కవలలను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.


