జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న పంటను భద్రపరిచేందుకు పటిష్టమైన స్టోరేజీ (నిల్వ) ఏర్పాట్లు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు.
ఆదివారం ‘కుడా’ (KUDA) ఆఫీసులో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు. వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.
అకాల వర్షాలు, వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు నష్టపోకుండా ఎనుమాముల మార్కెట్లో తగిన వసతులు కల్పించాలని సూచించారు. పంట నిల్వ సామర్థ్యాన్ని పెంచి, రైతులకు మార్కెటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ సమీక్ష లక్ష్యం అని పేర్కొన్నారు.


