జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని కొయ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాగులమ్మ క్రాస్ సమీపంలో ఇసుక లారీ, టిప్పర్ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాద తీవ్రతకు లారీ, టిప్పర్ క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వాహన డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే కొయ్యూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్లో ఇరుక్కున్న క్షతగాత్రుడిని పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


