వరంగల్, మే 16: వరంగల్ మహా నగర పాలక సంస్థ (GWMC) పరిధిలో శనివారం ఉదయం వెలిసిన కొన్ని వివాదాస్పద వాల్ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. “జస్టిస్ ఫర్ చిలుక భాస్కర్” అనే ప్రధాన నినాదంతో ప్రభుత్వ భూముల కబ్జా, అధికారుల అవినీతిని ఎండగడుతూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అంటించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఏనుమాముల పరిధిలో భూకబ్జా?
ఈ పోస్టర్లలో పేర్కొన్న వివరాల ప్రకారం… ఏనుమాముల పరిధిలోని సర్వే నంబర్ 257 లో ఉన్న విలువైన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు చిలుక భాస్కర్‌కు న్యాయం చేయాలంటూ ఈ పోస్టర్ల ద్వారా డిమాండ్ చేశారు.
అధికారుల పేర్లతో సహా పోస్టర్లు..!
సాధారణంగా వచ్చే ఆరోపణల లాగా కాకుండా, ఈసారి ఏకంగా కార్పొరేషన్ అధికారుల పేర్లను నేరుగా పోస్టర్లలో ప్రస్తావించడం వరంగల్ మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సదరు భూమిని కబ్జా చేయడానికి, అక్రమ నిర్మాణాలకు లేదా కాగితాల సృష్టికి కార్పొరేషన్ అధికారులే వెనక ఉండి సహకరించారంటూ పేర్లతో సహా బహిరంగంగా పోస్టర్లు వేయడం గమనార్హం.
బహిరంగంగా అధికారుల పేర్లు బయటపెడుతూ నగరంలో ఈ తరహా పోస్టర్లు వెలవడంపై అటు మున్సిపల్ శాఖలోనూ, ఇటు పోలీస్ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


