వరంగల్ జిల్లాలోని (Warangal District) గిర్నిబావి ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Accident) ఒక కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ (Sand Lorry) ఒక కారును ఢీకొనడంతో ఆ కారులో ప్రాయణిస్తున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అందుతున్న సమాచారం ప్రకారం, వరంగల్ కాశిబుగ్గ 20వ డివిజన్ పద్మానగర్‌కు చెందిన వెల్దండి వరుణ్ చాలా మంచి వ్యక్తి. ఎవ్వరిని హాని చేయడు.
తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంటారు.
వరుణ్ తెల్లవారుజామున సుమారు 3:40 గంటల సమయంలో కారులో వరంగల్ (Warangal) నుంచి నర్సంపేట వైపు ప్రయాణిస్తున్నారు.
అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఊహించని ఘోరం జరిగిపోయింది.
అప్పటి వరకు బాగానే ఉన్నా..గిర్నిబావి సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన ఇసుక లారీ అదుపుతప్పి వరుణ్ ప్రయాణిస్తున్న కారును చాలా వేగంగా బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఢీకొట్టిన వేగం తీవ్రంగా ఉండటంతో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వరుణ్ తీవ్ర గాయాలకు గురయ్యాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టారు.
అతడిని చికిత్స కోసం దగ్గరలోని ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే వరుణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
యువకుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతుడు వరుణ్ (Varun) కు భార్య నిఖిత, కుమారుడు హైత్విక్, కూతురు ఆహనా ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వరుణ్ అకాల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పద్మానగర్ ప్రాంతంలో కూడా ఈ వార్త తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే వరుణ్ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
ఇటీవల నగర పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో భారీ వాహనాలు, ముఖ్యంగా ఇసుక లారీలు అధిక వేగంతో సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా వాహనాలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా తెల్లవారుజామున, అర్ధరాత్రి సమయంలో ఇసుక లారీల వేగం నియంత్రణలో లేకపోవడంతో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనా, లేక మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
స్థానికులు మాత్రం ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


