హనుమకొండ కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” జిల్లా స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ కుడా చైర్మన్ హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్ ఛాహత్ బాజ్ పేయ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో భాగంగా పలు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇనగల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. “పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యపాలనలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పని చేసిందన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందించడం ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఐనవోలు, హాసన్ పర్తి మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ను అందజేసి సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.

అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా “బేటీ బచావో – బేటీ పడావో” పడావో పోస్టర్ ని ఆవిష్కరించారు. బాలిక రక్షణ విద్యాభివృద్ధిపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు . అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి స్టాల్స్ ను ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, కలెక్టర్ ఛాహత్ బాజ్ పేయ్ లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు , పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


