తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. ఒక్క రోజులోనే వడదెబ్బ కారణంగా 34 మంది మృతి చెందినట్లు సమాచారం. తీవ్ర ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు దాదాపు 46 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో ఎండల ప్రభావం మరింత ఎక్కువగా నమోదవుతుంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం రానున్న నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సూచించింది.

మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఎండలో ఎక్కువ సేపు తిరగకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.


