గీసుగొండ పోలీసుల సక్సెస్.. వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్ :
వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు నిందితులను గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ శనివారం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి కోనాయమాకుల ఎస్ఆర్ఎస్పీ కాలువ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు కరీంనగర్‌కు చెందిన సూర రవి, మహబూబాబాద్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్‌గా గుర్తించారు.
పోలీసుల విచారణలో ఇద్దరూ పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన వివిధ వస్తువులతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు 35 వేల వరకు ఉంటుంది అని పోలీసులు తెలిపారు. నిందితుల నేర చరిత్ర కూడా ఉన్నట్టు విచారణలో వెల్లడయింది.
సూర రవిపై కరీంనగర్, కేశవపట్నం, బోయినపల్లి, మానకొండూరు, మిల్స్ కాలనీ, ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 24 చోరీ కేసులు నమోదయ్యాయి. అలాగే ఎండి ఇమ్రాన్ పై వరంగల్ మిల్స్ కాలనీ, నర్సంపేట ఖాన్పూర్ ,మహబూబాబాద్ నగర్ , గీసుకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది చోరీ కేసును నమోదైనట్లు సీఐ వెల్లడించారు.
ఇద్దరు నిందితులపై ఇప్పటికే సస్పెక్ట్ షీట్లు కొనసాగుతున్నాయని వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా రిమాండ్ కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.


