608 కుటుంబాలకు సొంతింటి ఆనందం.. ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శాయంపేటలో నిర్మించిన 608 ఇందిరమ్మ రెండు పడకల ఇళ్ళను అర్హులైన లబ్ధిదారులకు మంగళవారం ఘనంగా పంపిణీ చేశారు. కళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా విధానంలో పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ముందుగా శాయంపేటలోని గృహ సముదాయాన్ని సందర్శించి నిర్మాణాల నాణ్యత మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సభలో మాట్లాడిన మంత్రి పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..”ఇల్లు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన కుటుంబాల ముఖాలలో ఆనందం చూడడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఇళ్ల పంపిణీలు రాజకీయాలకు తావు లేదని.. అర్హత ఏకైక ప్రమాణమని స్పష్టం చేశారు. ఇళ్ల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నియోజకవర్గంలో వేలాది మంది గృహరహితులు ఉన్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇళ్లను అత్యంత అర్హులైన కుటుంబాలకు కేటాయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి ప్రతి నిరాశ్రయ కుటుంబానికి గృహ వసతి కల్పించే దిశగా చర్యలు కొనసాగుతాయని చెప్పారు”.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల కేటాయింపు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.








