ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద :
వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కార్మికుల హాజరు అమలు విధానం పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతతో పాటు నిర్దేశిత లక్ష్యాల మేరకు కొనసాగాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులతో కలెక్టర్ ప్రత్యక్షకంగా మాట్లాడి వారి సమస్యలు అవసరాలను తెలుసుకున్నారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కార్మికులు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తగినంత నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాలలో జాగ్రత్తలు తీసుకోవడం, తలనొప్పి, అలసట లేదా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


