ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మొక్కలు నాటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు :
మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బిజెపి శిక్షణ శిబిరం ప్రాంగణంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పై ప్రజలకు సందేశం ఇచ్చారు.
అమ్మ పేరుతో ఆయన స్వయంగా మొక్కను నాటి ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుల పేర్లతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణం మార్పుల నేపథ్యంలో మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.
అనంతరం శిక్షణా శిబిరం ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రాంచందర్ రావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి శిక్షణ శిబిరాలు కీలక వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన శిక్షణ శిబిరానికి రాంచందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై పలు అంశాలపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని నాయకులు పిలుపునిచ్చారు.


