ఆదాయానికి మించి ఆస్తుల కేసు: ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్‌కు 14 రోజుల రిమాండ్:
రహదారులు మరియు భవనాల శాఖ (ఆర్అండ్బీ) చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఏసీబీ దర్యాప్తు ప్రకారం, మోహన్‌నాయక్ 1995లో ఆర్అండ్బీ శాఖలో రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, క్రమంగా పదోన్నతులు పొందుతూ చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నారు. అయితే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో మోహన్‌నాయక్ మొత్తం చట్టబద్ధ ఆదాయం రూ.3.94 కోట్లుగా గుర్తించగా, కుటుంబ వ్యయాలు దాదాపు రూ.3.89 కోట్లుగా నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఆయనకు మిగిలిన చట్టబద్ధ పొదుపు కేవలం రూ.4.43 లక్షలే అని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయన పేరుతో మరియు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.7.90 కోట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు.
పొదుపు మొత్తాన్ని మినహాయించిన తర్వాత సుమారు రూ.7.86 కోట్ల విలువైన ఆస్తులు ఆదాయానికి మించి కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆయన చట్టబద్ధ ఆదాయంతో పోలిస్తే 177 రెట్లు అధికంగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కాగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


