హనుమకొండ: ఉచితం అనే చిన్న ప్రకటన.. హనుమకొండలో పెద్ద గందరగోళానికి దారితీసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఒక హోటల్ నిర్వాహకుల వ్యాపార ప్రచార యావ, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో చివరకు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. ఉచిత బిర్యానీ ప్యాకెట్ల కోసం జనాలు భారీగా ఎగబడటంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు మహిళలు గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..?
హనుమకొండ కెయూ (KU) క్రాస్ రోడ్‌లో నూతనంగా ‘సురభి ఫుడ్ కోర్టు’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ ప్రచారం కోసం నిర్వాహకులు.. 300 బిర్యానీ ప్యాకెట్లను ఉచితంగా పంచుతామని ముందస్తుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఉచిత బిర్యానీ అనడంతో ఆ ప్రాంతంలోని పేదలు, సాధారణ ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
చిన్న సందులో పంపిణీ.. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం:
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, వందలాది మంది జనాలు వస్తారని తెలిసి కూడా నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయలేదు. ఒక చిన్న సందు లాంటి ప్రదేశంలో ఈ పంపిణీ చేపట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.

బిర్యానీ ప్యాకెట్ల కోసం జనాలు ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. క్యూ లైన్లు లేకపోవడం, సరైన బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడిపోయి గాయపడ్డారు.
వ్యాపార ప్రచారమే తప్ప.. ప్రాణాలకు విలువేది?
నిర్వాహకుల తీరుపై స్థానికులు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“తమ హోటల్ పబ్లిసిటీ పొందాలన్న స్వార్థం కోసం వందల మందిని పిలిచి, కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యం. ఇరుకైన సందులో పంపిణీ పెట్టి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి తొక్కిసలాట జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ప్రజలు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల భద్రతను గాలికొదిలేసే ఇలాంటి పంపిణీ కార్యక్రమాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

