సంవత్సరానికి 48 శాతం వరకు లాభాలు, కంపెనీలో వాటాలు ఇస్తామని హామీ ఇచ్చి దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను మోసగించిన కేసులో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు నేనావత్ భూపాల్ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో సుమారు 6 వేల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించగా, వారిలో దాదాపు 1,500 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని సమాచారం.
హైటెక్ కార్యాలయాలతో నమ్మకం కల్పించిన సంస్థలు:
భూపాల్ నాయక్ 2020లో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ పేరుతో రెండు సంస్థలను ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో ఆధునిక కార్యాలయాలు ఏర్పాటు చేసి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌తో పాటు ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టిస్తున్నామని ప్రచారం చేశాడు. వివిధ పెట్టుబడి పథకాల కింద 18 నుంచి 48 శాతం వరకు వార్షిక లాభాలు వస్తాయని నమ్మించి పెద్ద ఎత్తున నిధులు సేకరించాడు.
చెల్లింపులు నిలిపివేయడంతో బయటపడిన మోసం:
ప్రారంభంలో కొంతకాలం పెట్టుబడిదారులకు లాభాలు చెల్లించిన సంస్థలు, గత ఏడాది సెప్టెంబర్ నుంచి చెల్లింపులను నిలిపివేశాయి. దీంతో బాధితులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులను ఆశ్రయించారు. కొందరు బంగారం, వ్యవసాయ భూములు విక్రయించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు.
ఈవోడబ్ల్యూ కేసు.. గుజరాత్‌లో అరెస్ట్:
మోకిలకు చెందిన విశ్రాంత నేవీ అధికారి సహా పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహా కేసులు ఇతర రాష్ట్రాల్లో కూడా నమోదవడంతో నిందితుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయత్నంలో గుజరాత్ పోలీసులు భూపాల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తరువాత పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
మహబూబాబాద్‌లో ప్రచారంతో గుర్తింపు:
మహబూబాబాద్ జిల్లాలో కిసాన్ పరివార్ పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భూపాల్ నాయక్ స్థానికంగా గుర్తింపు పొందాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు భారీ పెట్టుబడి మోసం కేసులో అరెస్టు కావడంతో ఆయన కార్యకలాపాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


