ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ఏం జరగబోతోంది? ప్రభుత్వం హై అలర్ట్ :
తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాల లభ్యతతో పాటు వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాల వారీగా పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ:
ప్రత్యేక అధికారులకు కేటాయించిన జిల్లాల్లో వర్షపాతం, జలాశయాల్లో నీటి మట్టాలు, భూగర్భ జలాల స్థాయిలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ, ఉద్యాన పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరా వంటి కీలక అంశాలను నిరంతరం పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునేలా వివిధ శాఖల మధ్య సమన్వయం కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ అధికారులదే.
జూలై 20న ఆయా జిల్లాలను సందర్శించి, జిల్లా ఇన్చార్జి మంత్రులతో కలిసి సమీక్ష సమావేశాల్లో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమై స్థానిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.
జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు:
హైదరాబాద్‌కు జయేష్ రంజన్, రంగారెడ్డికి వికాస్ రాజ్, కరీంనగర్‌కు బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, మెదక్‌కు ఎ. వాణి ప్రసాద్, నిజామాబాద్‌కు డాక్టర్ యోగితా రాణా, నల్గొండకు హరిచందన దాసరి, ఆదిలాబాద్‌కు కె. ఇలంబరితి, వరంగల్‌కు ఎ. శ్రీదేవసేన, మహబూబ్‌నగర్‌కు వి.పీ. గౌతమ్, ఖమ్మంకు అనుదీప్ దురిశెట్టిని ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
జిల్లా నివేదికల తర్వాత సీఎం సమీక్ష:
ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినో ప్రభావంపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక అధ్యయన నివేదిక రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది.
అలాగే ప్రతి జిల్లాలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు జూలై 20న జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక అధికారుల నుంచి అందిన నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, అవసరమైన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం, తాగునీరు, ప్రజల అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు వేగవంతం చేసింది.
Read Warangal News and Latest Politics News and Real Estate


