ఎల్నీనో ఎఫెక్ట్.. వరంగల్‌కు కడియం శ్రీహరి కీలక హెచ్చరిక:
ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో త్రాగునీటి సరఫరాపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి దేవసేనతో పాటు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేవాదుల ప్రాజెక్టుకు సమగ్ర వర్కింగ్ మాన్యువల్ అవసరం:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో త్రాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కడియం శ్రీహరి అన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. నీటి నిర్వహణ కోసం సమగ్రమైన వర్కింగ్ మాన్యువల్ రూపొందించి, ప్రతి దశలో అమలు చేయాల్సిన విధానాలను స్పష్టంగా నిర్దేశించాలని సూచించారు.
100 రోజులపాటు మోటార్లు నిరంతరాయంగా నడవాలి:
దేవాదుల ప్రాజెక్టులోని మూడు దశల్లో ఉన్న మొత్తం 10 మోటార్లు కనీసం 100 రోజులపాటు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే మోటార్లలో సాంకేతిక లోపాలు తలెత్తితే వారం రోజుల పాటు ఆలస్యం కాకుండా, 48 గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసేలా సంబంధిత కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు మార్గనిర్దేశం:
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను గుర్తించాలని కడియం శ్రీహరి సూచించారు. జిల్లా, మండలాల వారీగా నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిశీలించి, ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సూచనలు ఇవ్వాలని అన్నారు. అవసరమైతే ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీ లేదా ఉచితంగా అందించాలని ప్రతిపాదించారు.
త్రాగునీటి సరఫరాకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి:
ప్రస్తుతం అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు అవసరాలకు సరిపోవడం లేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. బోర్లు, బావులు లేని గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలకు కలెక్టర్లకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎల్నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా, మండలాల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి, మొదటి ప్రాధాన్యతగా త్రాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గ్రామీణ ఉపాధి పథకాలను వ్యవసాయ అవసరాలకు అనుసంధానం చేస్తే రైతులతో పాటు వ్యవసాయ కూలీలకూ ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


