రహదారి అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి:
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కీలక రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించిన వినతిపత్రాలను సమర్పించి, ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కీలక రహదారి విస్తరణకు విజ్ఞప్తి:
హనుమకొండ జిల్లాలోని కరుణాపురం నుంచి పెద్ద పెండ్యాల, నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్ మండల కేంద్రం, దేవునూర్, సోమదేవరపల్లి, దామెర మీదుగా ఎల్కతుర్తి మండల కేంద్రం వరకు ఉన్న రహదారిని విస్తరించి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, సిద్ధిపేట ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు వరంగల్ నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండా జాతీయ రహదారులు 163, 563లను అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గంగా ఈ రోడ్డు కీలకంగా మారిందని వివరించారు. రోజువారీగా వేలాది మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నందున ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా దీనిని అభివృద్ధి చేయాలని కోరారు.
ఎన్హెచ్-163పై సర్వీస్ రోడ్ల పనులు పూర్తి చేయాలి:
యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి (ఎన్హెచ్-163) నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా నిర్మించిన సర్వీస్ రోడ్ల మధ్య మిగిలిపోయిన లింకులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, ఘన్పూర్ స్టేషన్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ వాటి మధ్య అనుసంధానం లేకపోవడంతో స్థానికులు ప్రధాన రహదారినే ఉపయోగించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా అధికమవుతోందని పేర్కొన్నారు. అవసరమైన భూమి ఇప్పటికే సేకరించినందున మిగిలిన లింకుల నిర్మాణానికి వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు.
సీఆర్ఐఎఫ్ నిధులతో కొత్త పనులకు ఆమోదం కోరుతూ:
కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి (CRIF) 2025–26 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు రహదారి అభివృద్ధి పనులకు కూడా ఆమోదం తెలపాలని వారు కోరారు. ముఖ్యంగా నర్సంపేట–నందిగామ రహదారి విస్తరణతో పాటు భట్టుపల్లి–హంటర్ రోడ్ అభివృద్ధి పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు.
వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి అభివృద్ధి ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన ఆమోదించాలని డా. కడియం కావ్య, కడియం శ్రీహరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, వినతులను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.


