సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి..ఉద్యోగుల జనజాగరణ యాత్ర:
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన 33 జిల్లాల జనజాగరణ యాత్ర బుధవారం హనుమకొండ జిల్లాకు చేరుకుంది. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు:
హనుమకొండ జిల్లాలో యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఉద్యోగుల ప్రతినిధులు ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు భవిష్యత్ భద్రత తగ్గుతోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేత:
జనజాగరణ యాత్రలో భాగంగా నగర పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే కాంగ్రెస్ పాలిత కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అదే విధానాన్ని తీసుకురావాలని ఉద్యోగులు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


